Home క్రైమ్ ఐదు నిమిషాల దూరంలో విషాదం..

ఐదు నిమిషాల దూరంలో విషాదం..

30
0
  • కారు ప్రమాదంలో మహిళ మృతి మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, జనవరి 27:

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. బంధువుల ఇంటికి కేవలం 50 మీటర్ల దూరంలో కారు ప్రమాదానికి గురికావడంతో ఒక మహిళ మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంచిర్యాల జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌కు చెందిన ఓ కుటుంబం సోమవారం సాయంత్రం తమ ఇంటి నుంచి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్‌లోని బంధువుల ఇంటికి కారులో బయల్దేరింది. ప్రయాణం సాగుతూ మహాత్మానగర్‌కు చేరుకునేసరికి అర్ధరాత్రి కావొచ్చింది. మరో ఐదు నిమిషాల్లో గమ్యస్థానానికి చేరాల్సి ఉండగా, రోడ్డుపై ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయిన కారు అదుపుతప్పింది. అదుపు తప్పిన కారు రోడ్డుపక్కన ఉన్న చెట్టును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో భారీ శబ్దం రావడంతో స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. బంధువుల ఇంటికి అతి సమీపంలోనే ఈ దుర్ఘటన జరగడం కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులను శోకసంద్రంలో ముంచింది.