Home POLITICS కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్

కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్

5
0
  • మైనర్లతో తుపాకులు పట్టిస్తారా? మానకొండూరు, ఆర్గాన్ న్యూస్, జూన్ 16:

తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తోందని, అయితే కాంగ్రెస్ పార్టీ అనవసర రాజకీయాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు. మంగళవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలపై ఘాటుగా స్పందించారు.

తెలంగాణకు రూ.10 లక్షల కోట్ల నిధులు

గత 12 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించిందని బండి సంజయ్ తెలిపారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి నగరాల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. “ఆ నిధులన్నీ ఎటు వెళ్లాయి? ప్రజలకు లెక్క చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది” అని ప్రశ్నించారు.

అక్రమ వలసదారుల అంశంపై కాంగ్రెస్‌కు సవాల్

దేశంలో అక్రమంగా చొరబడిన వలసదారుల ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమ వలసదారులను స్థానిక ముస్లిం సమాజంతో పోల్చడం ద్వారా కాంగ్రెస్ వారిని అవమానిస్తోందని ఆరోపించారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు.

మావోయిస్టు భావజాలంపై తీవ్ర విమర్శలు

మావోయిస్టు భావజాలం సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తోందని బండి సంజయ్ అన్నారు. తుపాకీ సంస్కృతి, హింస, మారణహోమంతో ఏ సమస్యకూ పరిష్కారం లభించదని స్పష్టం చేశారు. “ఏమీ తెలియని మైనర్ పిల్లల చేత తుపాకులు పట్టించడం అత్యంత దారుణం. ఇప్పటికే చాలామంది లొంగిపోయారు. ఇంకా ఆ ఆలోచనల్లో ఉన్నవారు తమ భవిష్యత్తు కోసం మారాలి” అని పిలుపునిచ్చారు.

యువత, రైతుల సంక్షేమమే లక్ష్యం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. “ప్రధానమంత్రి రోజ్‌గార్ మేళా” ద్వారా ఏడాదిన్నర కాలంలోనే 12 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. అలాగే రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, కనీస మద్దతు ధర (ఎంఎస్పి) పెంపు వంటి చర్యలు చేపట్టినట్లు వివరించారు.

స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం

స్టార్టప్ ఇండియా ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. విదేశీ వస్తువులపై ఆధారపడకుండా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, భారత్‌ను ఎగుమతుల్లో అగ్రగామిగా తీర్చిదిద్దడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని బండి సంజయ్ పేర్కొన్నారు.
“అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు.. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుంది” అని ఆయన అన్నారు.