Home agriculture నిబంధనలకు లోబడే రీ సర్వే

నిబంధనలకు లోబడే రీ సర్వే

6
0
  • జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
  • ప్రతి రైతుకు పూర్తి అవగాహన కల్పించి రీ సర్వే చేయాలి
  • ప్రభుత్వ భూములు, రహదారులు, ప్రజా స్థలాల వివరాలు కోఆర్డినేట్లతో నమోదు చేయాలి
  • రోజుకు ప్రతి బృందం 50 నుండి 70 ఎకరాల వరకు రీ సర్వే పూర్తి చేయాలి
  • సర్వే వివరాల డేటా ఎంట్రీ, మ్యాప్ తయారీ సమాంతరంగా కొనసాగాలి
  • తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో చేస్తున్న రీ సర్వే అధికారులకు దిశా నిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్

తిరుమలాయపాలెం, మే 12 :

రీ సర్వే ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు.
తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మంగళవారం పరిశీలించి రీ సర్వే నిర్వహిస్తున్న అధికారులను కలిసి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ…

కాకరవాయి గ్రామంలో ఆర్‌ఎస్‌ఆర్ పట్టా విస్తీర్ణ సమస్యలు ఉన్నందున వాటి పరిష్కారం కోసం రీ సర్వే చేపడుతున్నామని, భూ వివాదాల పరిష్కారం, భూ రికార్డుల నవీకరణ లక్ష్యంగా రీ సర్వే చేపట్టి, భూముల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయనున్నట్లు చెప్పారు.
రైతు వేదికను కేంద్రంగా చేసుకుని అక్కడే కంప్యూటర్ ఏర్పాటు చేసి భూ వివరాలను నమోదు చేయాలని సూచించారు. గ్రామంలో రీ సర్వే నిర్వహణ కోసం ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి బృందంలో ఒక సర్వేయర్, జీపీవోలు ఉంటారని చెప్పారు.
రీ సర్వే ప్రక్రియలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, జీవో ప్రకారం విధి విధానాలు అమలు చేయాలని ఆదేశించారు. మొదట ఫారం-6 ఇవ్వాలని, అనంతరం 15 రోజుల గడువు పాటించిన తరువాతే తదుపరి ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. నిబంధనల ప్రకారం పూర్తి ప్రక్రియను గుర్తించి అమలు చేయాలని సూచించారు. ఇందుకోసం ఎస్‌ఓపీ సిద్ధం చేసుకుని దశలవారీ విధానాన్ని ఖచ్చితంగా అనుసరించాలని తెలిపారు.
గ్రామంలోని అన్ని రహదారులు, ప్రజా స్థలాలు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ సంస్థల భూముల వివరాలను కోఆర్డినేట్లతో సహా ఖచ్చితంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూముల వివరాలను స్పష్టంగా పంచనామా చేసి నమోదు చేయాలని సూచించారు.
ప్రతి బృందం రోజుకు 50 నుంచి 70 ఎకరాల వరకు రీ సర్వే పూర్తి చేయాలని, ఐదు బృందాలు కలిసి రోజుకు సుమారు 250 నుంచి 300 ఎకరాల వరకు సర్వే నిర్వహించాలని కలెక్టర్ లక్ష్యాలను నిర్దేశించారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటలకే బృందాలు క్షేత్రస్థాయిలో పని ప్రారంభించాలని ఆదేశించారు. ప్రతి రైతు పేరు, భూ విస్తీర్ణం, పూర్తి వివరాలు సేకరించి నమోదు చేయాలని సూచించారు. ప్రతిరోజూ సర్వే నివేదికలు సమర్పించాలని, సర్వే వివరాల డేటా ఎంట్రీ, మ్యాప్ తయారీ ప్రక్రియ సమాంతరంగా కొనసాగాలని తెలిపారు.
ఈ గ్రామంలో ఆర్‌ఎస్‌ఆర్ పట్టా విస్తీర్ణ సమస్యలు ఉన్నందున వాటి పరిష్కారం కోసం రీ సర్వే చేపడుతున్నామని తెలిపారు. రీ సర్వే ద్వారా ఎవరూ తమ భూమి విస్తీర్ణాన్ని కోల్పోరని స్పష్టం చేశారు.ప్రస్తుతం గ్రామంలో సర్వే నంబర్ల విషయంలో ఉన్న గందరగోళం పూర్తిగా తొలగిపోతుందని, అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.
రీ సర్వే విజయవంతంగా నిర్వహించాలంటే గ్రామ సభలు నిర్వహించడం తప్పనిసరి అని చెప్పారు. రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న మూడు గ్రామాల ప్రజలందరినీ గ్రామ సభకు ఆహ్వానించాలని సూచించారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలని అధికారులకు సూచించారు.
క్షేత్రస్థాయిలో రీ సర్వే సమయంలో వివిధ సమస్యలు వచ్చే అవకాశముందని, అందుకే ఆర్డీఓ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే కమిటీకి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని, కమిటీ ఆమోదించిన తరువాత మాత్రమే సర్వే ప్రక్రియ కొనసాగించాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారులు ఎలాంటి వివాదాలకు దిగకుండా సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ విల్సన్, సర్వేయర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.