Home క్రైమ్ రైతు చావుకు కారణం ఎవరు? ప్రభుత్వంపై మండి పడిన రసమయి

రైతు చావుకు కారణం ఎవరు? ప్రభుత్వంపై మండి పడిన రసమయి

15
0

మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, మే 6:

కరీంనగర్ జిల్లా శంకపట్నం మండలం గద్దపాక గ్రామంలో వడ్ల కుప్పపై గుండెపోటుతో ప్రాణాలు విడిచిన రైతు కొయ్యడ ఐలయ్య మృతిపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వగ్రామం గద్దపాకలో జరిగిన అంత్యక్రియలకు హాజరైన ఆయన, ఐలయ్య పాడె మోసి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు మరణానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కొనుగోలు కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభించడం తప్ప, ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అన్న విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పూర్తిగా విస్మరించారని విమర్శించారు.
పంట కోసి కల్లాల్లో 20 రోజులుగా ధాన్యం పెట్టి ఎదురుచూస్తున్న రైతులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. ధాన్యాన్ని కాపాడుకునే క్రమంలోనే రైతు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండ, వానలకు తట్టుకుని వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంట పండించిన రైతులకు, అమ్ముకునే పరిస్థితి లేకపోవడం వల్ల తీవ్ర నిరాశ నెలకొందన్నారు.
గద్దపాకతో పాటు అనేక గ్రామాల్లో ధాన్యం తూకాలు వేయకుండా అలాగే పేరుకుపోతున్నాయని, తూకం వేసినా లారీలు రాక మిల్లులకు తరలింపు జరగక బస్తాలు అలాగే నిలిచిపోతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితులను వెంటనే సరిచేయాలని, ధాన్యం తూకాలను వేగవంతం చేసి లారీల ద్వారా మిల్లులకు తరలింపును తక్షణం ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
మృతి చెందిన రైతు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే రైతులతో కలిసి పెద్దఎత్తున ఆందోళన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.