- జిల్లాలో సమృద్ధిగా 10,345 మెట్రిక్ టన్నుల స్టాక్
- జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఆర్గాన్ | ఖమ్మం | జనవరి 7:
జిల్లాలో యాసంగి సాగు అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. యూరియా సరఫరాపై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
బుధవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు సకాలంలో యూరియా అందించేందుకు జిల్లా యంత్రాంగం సమగ్ర చర్యలు చేపట్టిందన్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో మొత్తం 10,345 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ అందుబాటులో ఉందని తెలిపారు.
అందుబాటులో ఉన్న స్టాక్‌లో 83 పీఏసీఎస్ కేంద్రాల్లో 1,169.10 మెట్రిక్ టన్నులు, 100 ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో 525.70 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు వివరించారు. ఇప్పటివరకు జిల్లాలో రైతులకు 28,128 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా పూర్తయ్యిందని పేర్కొన్నారు.
యూరియా పంపిణీ ప్రక్రియను జిల్లా యంత్రాంగం, జిల్లా వ్యవసాయ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోందని, ఎక్కడైనా సమస్యలు తలెత్తితే సంబంధిత మండల వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని వెంటనే సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
రైతుల సాగు అవసరాలకు ఆటంకం కలగకుండా యూరియా సరఫరా సజావుగా కొనసాగుతుందని ఆయన భరోసా ఇచ్చారు.








