- అనుమతులు లేవని విద్యాశాఖ సమాధానం కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, మార్చి 11:
కరీంనగర్ నగరంలోని “కోటా పబ్లిక్ స్కూల్” వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఓ సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరగా విద్యాశాఖ అధికారులు ఇచ్చిన సమాధానం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో కోటా పబ్లిక్ స్కూల్‌కు అసలు అనుమతి ఉందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సమాచార హక్కు చట్టంతో వెలుగులోకి
కోటా పబ్లిక్ స్కూల్‌కు సంబంధించిన అనుమతులు, నమోదు వివరాలు, విద్యాశాఖ గుర్తింపు వంటి అంశాలపై సమాచారం ఇవ్వాలని ఒక సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం–2005 కింద జిల్లా విద్యాశాఖ అధికారికి దరఖాస్తు చేశారు. దీనిపై స్పందించిన జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ తమ కార్యాలయ రికార్డుల్లో “కోటా పబ్లిక్ స్కూల్” అనే పేరుతో ఎటువంటి విద్యాసంస్థ నమోదు కాలేదని అధికారికంగా లేఖ ద్వారా స్పష్టం చేశారు. విద్యాశాఖ సమాధానం వెలుగులోకి రావడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కోటా పబ్లిక్ స్కూల్..? లేకా కేపీఎస్..?
కోటా పబ్లిక్ స్కూల్ పేరుతో బోర్డు పెడితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించిన యాజమాన్యం “కేపీఎస్” అనే సంక్షిప్త పేరుతో పాఠశాలను నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. “కేపీఎస్” అంటే “కోటా పబ్లిక్ స్కూల్” అనే అర్థం వచ్చేలా తెలివిగా బోర్డు పెట్టి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ రికార్డుల్లో స్కూల్ పేరు లేకపోయినా, మరో పేరుతో విద్యాసంస్థ నడుస్తుందా? అనుమతులు లేకుండానే విద్యార్థులకు బోధన జరుగుతుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
మామూళ్ల మత్తులో విద్యాశాఖ..?
ప్రైవేట్ విద్యాసంస్థల విషయంలో విద్యాశాఖ అధికారుల వ్యవహారంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలు నడుస్తున్నా అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కోటా పబ్లిక్ స్కూల్ యాజమాన్యం విద్యాశాఖ నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నప్పటికీ చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థి, యువజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


