Home తెలంగాణ చెంజర్ల అవినీతిపై అధికారులు మౌనమెందుకు?

చెంజర్ల అవినీతిపై అధికారులు మౌనమెందుకు?

21
0
  • చట్టం ఎవరి కోసం? అధికార దుర్వినియోగానికి జవాబుదారీదెవరు మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, జనవరి 26:

కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారూ, ఆర్డీవో గారూ—
మానకొండూరు మండలం చెంజర్ల గ్రామపంచాయతీలో జరుగుతున్న అవినీతి మీ దృష్టికి వచ్చిందా లేదా? లేక చూసీ చూడనట్టు వదిలేస్తున్నారా? గ్రామపంచాయతీ కారోబార్‌, కార్యదర్శి కలిసి పంచాయతీరాజ్ చట్టాన్ని బహిరంగంగా ఉల్లంఘిస్తున్నా, అధికార యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదు?
ఎలాంటి గృహ నిర్మాణం లేకపోయినా, ప్రభుత్వ భూమిలో ఆర్‌సీసీ ఇల్లు కట్టినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి అసైన్‌మెంట్ పొందడం—ఇది నేరం కాదా? ఇంటి నెంబర్లు ఉన్నా, నేల మీద ఇళ్లు లేని పరిస్థితి మీ అధికారిక తనిఖీలకు కనిపించలేదా? లేక ఈ అక్రమాలకు పై స్థాయి అండదండలున్నాయా అన్న అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయి.
ఇంటి పన్నుల వసూళ్ల విషయంలో మరింత ఘోరం జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. ఆన్లైన్‌లో నమోదు చేయకుండా, వేరే రసీదు బుక్కులు నిర్వహిస్తూ గ్రామ ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పబడుతోంది. ఇది కేవలం అవినీతి కాదు—ప్రజాధనంపై దొంగతనం. ఈ డబ్బు ఎవరి ఖాతాల్లోకి వెళ్లింది? దీనిపై ఇప్పటివరకు ఒక్క ఆడిట్ ఎందుకు జరగలేదు?
ఎంపీడీఓ, డీపీఓలకు మౌఖికంగా ఫిర్యాదులు అందినప్పటికీ చర్యలు లేకపోవడం వెనుక కారణం ఏమిటి? ఫిర్యాదులు వచ్చినా స్పందించకపోవడం కూడా బాధ్యతారాహిత్యమే కదా! జిల్లా స్థాయి అధికారులు మౌనంగా ఉంటే, గ్రామస్థాయిలో చట్టం ఎవరి చేతుల్లో ఉంటుంది?
ప్రభుత్వం “స్వచ్ఛ పాలన”, “పారదర్శకత” అని నినాదాలు ఇస్తోంది. మరి చెంజర్లలో ఆ నినాదాలు ఎందుకు అమలవ్వడం లేదు? కారోబార్‌, కార్యదర్శిపై తక్షణమే సస్పెన్షన్ వేటు ఎందుకు పడలేదు? అక్రమంగా కేటాయించిన ఇంటి నెంబర్లను ఇప్పటివరకు ఎందుకు రద్దు చేయలేదు?
ఇది ఒక్క చెంజర్ల సమస్యగా భావించి వదిలేస్తే, రేపు మరిన్ని గ్రామాల్లో ఇదే మోడల్ అవినీతి పునరావృతమవుతుంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం కళ్లుతెరచి, స్వతంత్ర విచారణకు ఆదేశించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
లేకపోతే, అధికారులు మౌనంగా ఉన్నారన్న ముద్ర చెంజర్లకే కాదు—మొత్తం పాలనా వ్యవస్థకే పడుతుంది.