- మహాత్ముడి అడుగుజాడల్లో నడవటమే నిజమైన నివాళి
మిర్యాలగూడ ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, జనవరి 30 :
జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను సాధించేందుకు యువత ముందుకు రావాలని పార్లమెంట్ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ పిలుపునిచ్చారు. గాంధీ అడుగుజాడల్లో నడవటమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని వారు పేర్కొన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ, ఆంగ్లేయుల బానిసత్వం నుంచి దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహనీయుడు గాంధీ అని కొనియాడారు. సత్యం, అహింస, ధర్మం, శాంతి మార్గాలతో గాంధీ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని తెలిపారు. కుల–మత వివక్షలేని సమాజ స్థాపన కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని గాంధీ గట్టిగా విశ్వసించేవారని గుర్తు చేశారు. గాంధీ జీవితాన్ని, ఆయన ఆలోచనలను అవగాహన చేసుకోవాలంటే యువత తప్పనిసరిగా ఆయన ఆత్మకథ సత్యాన్వేషణలో నా ప్రయోగాలు చదవాలని వారు సూచించారు.


