Home Adyatmikam సంక్రాంతినాడు ఏమి చేయాలి ?

సంక్రాంతినాడు ఏమి చేయాలి ?

62
0
  • అసలు సంక్రాంతి అంటే?

ఆర్గాన్ ప్రత్యేక ప్రతినిధి:

ఏదైనా ఒక గ్రహము ఒక రాశినుండి వేరొకరాశి లోనికి ప్రవేశించడాన్ని సంక్రమణము లేక సంక్రాంతి అంటారు.
ఆ సమయం పుణ్యకాలము.
ఆ సమయంలో చేసిన స్నాన, దాన, జప, హోమ, పూజాదులు మరియు శ్రాద్ధాదులకు ఎంతో ఫలితముంటుంది.
అయితే ఆ సమయం సామాన్యప్రజానీకానికి ఎపుడో తెలియదు.
అయితే జ్యోతిష సిద్ధాంతగ్రంథాలలో దీనిని తెలియజేసారు మన మహర్షులు.
అన్ని సంక్రాంతులలోనూ సూర్యుని సంక్రమణానికి (సంక్రాంతి కి) విశేషప్రాధాన్యమున్నది.
ఎందువల్లన అంత ప్రాధాన్యత అంటే రవి సంక్రాంతులబట్టి ఫలితాలను మహర్షులు మనకు అందించారు.
ఆ రవి సంక్రమణం ఏ వారంలో జరిగితే ఏ ఫలితమో, ఏ తిథిలో జరిగితే ఏ ఫలితమో, అదేవిధంగా
లగ్న-నక్షత్ర-యోగ-కరణాదులకు ఫలితాలని మనకు తెలిపారు.
అయితే సంక్రాంతి అంటే రవి రాశి మారటమేననీ జ్యోతిష విద్యార్థులు, ఇక మకరసంక్రమణం మాత్రమే సంక్రాంతి అనీ సామాన్యులు పొరబడుతూ ఉంటారు.

సంక్రాంతినాడు ఏమి చేయాలి?

“సంక్రాంతౌ యాని దత్తాని హవ్యకవ్యాని దాతృభిః
తాని నిత్యం దదాత్యర్కః పునర్జన్మని జన్మని”

అని మనుస్మృతి* యందలి వచనం.
అనగా సంక్రాంతి నాడు ఆచరించిన దేవ, పితృకార్యముల ఫలాలను సూర్యభగవానుడు మనకు ప్రతినిత్యమూ, ప్రతీ జన్మ యందూ అందిస్తూనే ఉంటాడు.

ఇక పద్మపురాణం లో…

“రవేః సంక్రమణం రాశౌ సంక్రాంతిరితి కథ్యతే
స్నాన దాన తపోశ్రాద్ధ హోమాదిషు మహాఫలా”
అని వ్యాసభగవానుడు తెలిపాడు.
పై శ్లోకాన్ననుసరించి ‘రవి రాశి మారుటను ‘సంక్రాంతి’ అంటారు.
ఆ రోజు ఆచరించిన స్నాన,దాన,తప,శ్రాద్ధ,హోమాదులు ఉత్కృష్ట ఫలాన్నిస్తాయి.’ అని అవగతమౌతోంది.

ఇక శాతాతపస్మృతి ఇలా అంటోంది…

“రవిసంక్రమణే ప్రాప్తే న స్నాయాద్యస్తు మానవః సప్తజన్మని రోగీ స్యాన్నిర్ధనశ్చైవ జాయతే”
అంటే సంక్రాంతి నాడు స్నానము చేయనివాడు రాబోయే ఏడు జన్మలలోనూ రోగాలతోనే ఉంటాడు. పేదరికాన్ని కూడా అనుభవిస్తూనే ఉంటాడు.
సంక్రాంతి నాడు ఆచరించిన పుణ్య, పాప కర్మల ఫలితాన్ని కాలస్వరూపిణి యైన ఆ దేవియే స్వయంగా అందిస్తుందని దేవీపురాణం వివరిస్తోంది.
“పుణ్యపాపవిభాగేన ఫలం దేవీ ప్రయచ్ఛతి
ఏకథాపి కృతం తస్మిన్ కోటి కోటి గుణం భవేత్
ధర్మో వివర్ధతే హ్యాయూ రాజ్యం పుత్రసుఖానిచ
అధర్మ వ్యాధిశోకాది విషువాయన సన్నిధౌ”

“పుణ్యపాపములను అనుసరించి
ఆ దేవియే స్వయంగా ఫలితాలను అందిస్తుంది. సంక్రాంతులయందు ఒక్క ధర్మ కార్యమాచరించిననూ దాని ఫలం కోటి కోట్లవుతుంది.
ఆయువు, రాజ్యము, పుత్రాది సుఖము పెరుగుతాయి.
అదేవిధంగా సంక్రాంతులయందు ఒక్క అధర్మకార్యము ఆచరించినా వ్యాధులు, శోకము మున్నగు చెడుఫలితాలు కూడా కోటి రెట్లు పెరుగుతాయి.”

కోరికలు తీరేందుకు భవిష్య పురాణంలో…

భవిష్యపురాణంలో కోరికలు తీరాలంటే సంక్రాంతి నాడు ఏమి చేయాలో ఇలా తెలుపుతోంది…
“ఉపోష్యైవ చ సంక్రాంత్యాం ప్రాతర్యోభ్యర్చయేద్ధరిమ్
స్నాత్వా పంచోపచారేణ స కామానఖిలాన్ లభేత్”
“సంక్రాంతి ముందురోజున ఉపవాసముండి, సంక్రాంతి నాడు ప్రాతఃకాలము ఎవరైతే స్నానము చేసి పంచోపచారములతో శ్రీహరి ని పూజిస్తారో వారి కోరికలన్నీ తీరుతాయి” అని పైశ్లోకార్థాన్ని వర్షక్రియాకౌముది అనే గ్రంథం వివరిస్తోంది.
(పిల్లలు ఉన్నవారు ఉపవాసం చేయకూడదు.)

సరే మకరసంక్రమణం ఎప్పుడు ?

చతుర్వర్గ చింతామణి అనే ప్రాచీన ధర్మశాస్త్ర గ్రంథంలో ఇలా ఉన్నది…
“అయనాంశకతుల్యేన కాలేనైవ స్ఫుటం భవేత్ మృగకర్కాదిగే సూర్యే యామ్యోదగయనే సతి”

అయనాంశలు
అనేవాటిని అనుసరించి రవిస్ఫుటము ఉంటుంది.
రవి రోజూ (స్థూలమానంలో) ఒక భాగం లేక డిగ్రీ ప్రయాణం చేస్తాడు.
అందువలన ఎన్నిడిగ్రీలు అయనాంశ చ్యుతి ఉన్నదో అన్నిరోజులు దక్షిణాయనచ్యుతి లేక ఉత్తరాయన చ్యుతి ఉంటుంది.”
ఆ ఆయనాంశలను బట్టి సంక్రమణాలలో మార్పు వస్తుంది.