Home POLITICS వెలుగుమట్ల నిర్వాసితుల కోసం కవిత పోరాటం తీవ్రం

వెలుగుమట్ల నిర్వాసితుల కోసం కవిత పోరాటం తీవ్రం

29
0
  • పోలీస్ స్టేషన్‌ నుంచి నేరుగా అంబేద్కర్ భవన్‌కు
  • బాధితులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష

ఖమ్మం ప్రతినిధి ,ఆర్గాన్ న్యూస్ మార్చి9:

ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన ఆందోళన రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోమవారం జరిగిన ఘటనలతో ఖమ్మం నగరంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
వెలుగుమట్లలో ఇళ్లు కూల్చివేతలతో ఇబ్బందులు పడుతున్న బాధితులను సోమవారం ఉదయం కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుల సమస్యలను తెలుసుకుని వారికి తెలంగాణ జాగృతి తరఫున పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే పేదలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె విమర్శించారు.

అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా

బాధితులతో కలిసి కవిత అనంతరం ఖమ్మం నగరంలోని జడ్పీ సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్తో పాటు పలువురు నాయకులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు పాల్గొన్నారు. బాధితులకు న్యాయం చేయాలని, ఇళ్ల కూల్చివేతలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు నినాదాలు చేశారు.

పోలీసుల జోక్యం – ఉద్రిక్తత

అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారన్న కారణంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు కవితతో పాటు విశారదన్ మహారాజ్ మరియు ఇతర ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సమయంలో పోలీసులు, తెలంగాణ జాగృతి కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుని కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు సెక్షన్ 41 CrPC కింద నోటీసులు జారీ చేసి విడుదల చేశారు.

విడుదల అనంతరం వెనక్కి తగ్గని కవిత

పోలీసుల విడుదల అనంతరం కవిత తన ఆందోళనను నిలిపివేయకుండా రాత్రి సుమారు 9 గంటల సమయంలో నేరుగా ఖమ్మంలోని అంబేద్కర్ భవన్కు చేరుకున్నారు. అక్కడ వెలుగుమట్ల నిర్వాసితులతో కలిసి నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. దీంతో మరోసారి రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.

“బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం”

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ పేద ప్రజల ఇళ్లను కూల్చివేసి వారిని రోడ్డున పడేయడం తీవ్ర అన్యాయమని అన్నారు. బాధితులకు ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయంగా ఇళ్ల స్థలాలు, నివాస సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు తాను చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.

అంబేద్కర్ భవన్ వద్ద భారీ బందోబస్తు

కవిత దీక్ష ప్రారంభించడంతో అంబేద్కర్ భవన్ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధితులకు మద్దతుగా వస్తున్న నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నట్లు సమాచారం. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
వెలుగుమట్ల నిర్వాసితుల సమస్యపై ప్రారంభమైన ఈ ఆందోళన రానున్న రోజుల్లో మరింత రాజకీయంగా వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.