Home Uncategorized ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల

ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల

15
0
  • గేట్లు ఎత్తిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 20:

బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాల్లో సాగులో ఉన్న పంట భూములు దెబ్బతినకుండా రైతులకు సకాలంలో కాలువల ద్వారా నీటిని అందిస్తున్నామని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. శనివారం ఇల్లంతకుంట మండలం అంతగిరి వద్ద ఉన్న అన్నపూర్ణ ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా నీటి విడుదలకు ఆయన ఎస్సారెస్పీ అధికారులతో కలిసి గేట్లను ఎత్తివేశారు.
అదేవిధంగా కందికట్కూర్–వల్లంపట్ల గ్రామాల మధ్య ఉన్న మిడ్ మానేరు జలాశయం గేట్లను ఎత్తి కాలువలకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నపూర్ణ ప్రాజెక్టు నుంచి 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం వల్ల సుమారు 15 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. అలాగే మిడ్ మానేరు నుంచి 100 క్యూసెక్కుల నీటి విడుదలతో బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాల రైతులకు గణనీయమైన మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
ముందస్తుగా నీటిని విడుదల చేయడం వల్ల వరినాట్లు వేసుకున్న రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. మిడ్ మానేరు నుంచి విడుదలైన నీరు గన్నేరువరం, ఇల్లంతకుంట మండలాల మీదుగా గౌరవెల్లి వరకు ప్రవహిస్తుందని తెలిపారు. ప్రస్తుత ఆయకట్టు విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు అవసరమైన భూసేకరణ చేపట్టి సాగునీటి విస్తరణకు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

పర్యాటక కేంద్రంగా అంతగిరి అభివృద్ధి

అన్నపూర్ణ ప్రాజెక్టు పరిధిలోని అంతగిరిని రాబోయే రోజుల్లో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వెల్లడించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న స్థానికుల ఆకాంక్షను నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి, ముఖ్యంగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్సారెస్పీ ఎస్సీ, ఈఈ, డీఈలతో పాటు ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మండల పరిషత్ మాజీ అధ్యక్షులు ఊట్కూరి వెంకటరమణారెడ్డి, గుడిసె అయిలయ్య, సింగిల్ విండో మాజీ చైర్మన్ ఐరెడ్డి మహేందర్ రెడ్డి, పార్టీ నాయకులు పసుల వెంకటి, నవీన్, గూడ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.