- జాజుల లింగంగౌడ్
మిర్యాలగూడ ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మే 12:
నీట్ (యూజీ)-2026 ప్రశ్నాపత్రాల లీకేజీ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన ఘటన అని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్ అన్నారు. మే 3న నిర్వహించిన నీట్ పరీక్షను ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా రద్దు చేస్తున్నట్లు జాతీయ పరీక్ష సంస్థ (ఎన్‌టీఏ) ప్రకటించడం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర నిరాశ కలిగించిందన్నారు.
రాజస్థాన్‌లో జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అమరవీరుల స్తూపం వద్ద ఫ్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా లింగంగౌడ్ మాట్లాడుతూ, అత్యంత భద్రత మధ్య ఉండాల్సిన ప్రశ్నాపత్రాలు ఈ విధంగా లీక్ కావడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి ఘటనలు విద్యా వ్యవస్థపై విద్యార్థుల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి, హాస్టళ్లలో ఉంటూ కోచింగ్ తీసుకుంటూ రాత్రింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థుల శ్రమ వృథా అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు, రాంబాబు, లవన్ కుమార్, వెంకటయ్య, సతీష్, వెంకటేష్, నవీన్, సందీప్, ప్రదీప్, గౌతమ్, శిల్ప, అశ్విని, స్వాతి, లావణ్య, సునీత తదితరులు పాల్గొన్నారు.






