Home తెలంగాణ రైస్ మిలర్ల నిరసన

రైస్ మిలర్ల నిరసన

16
0
  • ములుగు జిల్లా రైస్ మిలార్లు నల్ల బ్యాడ్జి లతో కలెక్టరేట్ ముందు నిరసన
  • డిఫాల్ట్ మిల్లర్లపై విధించిన 25% పెనాల్టీ, 12% వడ్డీని మాఫీ చేయాలి
  • జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాదం ప్రవీణ్

ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, మార్చి 9:

తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్ ఆధ్వర్యంలో ములుగు జిల్లాకు చెందిన రైస్ మిల్లర్లు నేడు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లి తమ సమస్యలను వివరించి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాదం ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వానికి మధ్య కీలకమైన వారధిగా పనిచేస్తున్న రైస్ మిల్ ఇండస్ట్రీ గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని తెలిపారు. ప్రభుత్వ విధానాలు పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు విద్యుత్ చార్జీలు గోదాముల కొరత ధాన్యం నాణ్యత సమస్యలు వంటి అనేక కారణాల వల్ల రైస్ మిల్లర్లు నష్టాల బాటలో నడుస్తున్నారని బాదం ప్రవీణ్ పేర్కొన్నారు.ప్రత్యేకంగా 2019-20 కరోనా కాలంలో ప్రభుత్వం ధాన్యం భారీగాకేటాయించడంతో చాలా రైస్ మిల్లులు సమయానికి సీఎంఆర్ బియ్యం అందించలేకపోయామని తెలిపారు.హమాలీలు గోదాముల కొరత వంటి కారణాల వల్ల ధాన్యం నిల్వలు ఎక్కువకాలం ఉండి నాణ్యత దెబ్బతిన్నదని దీనివల్ల మిల్లర్లు భారీ నష్టాలను చవిచూశారని చెప్పారు.అదేవిధంగా అప్పట్లో ధాన్యం మద్దతు ధర 1835 రూపాయలు ఉండగా ప్రస్తుతం 2025-26 సంవత్సరం నాటికి అది 2389 రూపాయలకు పెరిగిందని వారు తెలిపారు.ఈ పరిస్థితుల్లో డిఫాల్ట్ మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం అందించాలంటే అదనంగా లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని దీనితో పాటు ప్రభుత్వం విధించిన 25 శాతం పెనాల్టీ 12 శాతం వడ్డీ మిల్లర్లపై తీవ్రమైన ఆర్థిక భారంగా మారిందని బాదం ప్రవీణ్ అన్నారు.ఇటీవల కరీంనగర్ జిల్లాలో ఒక డిఫాల్ట్ రైస్ మిల్ కుటుంబానికి చెందిన మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటనను ప్రస్తావిస్తూ ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మిల్లర్లు విజ్ఞప్తి చేశారు.రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడో వంతు రైస్ మిల్లులు డిఫాల్టర్లుగా మారిన పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.అంతేకాకుండా మిల్లర్లకు ప్రభుత్వం నుంచి రావలసిన మిల్లింగ్ చార్జీలు ట్రాన్స్పోర్ట్ చార్జీలు డ్రైయేజ్ చార్జీలు కస్టోడియన్ చార్జీలు కూడా గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయని వారు పేర్కొన్నారు.ఈ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో డిఫాల్ట్ మిల్లర్లపై విధించిన 25 శాతం పెనాల్టీ 12 శాతం వడ్డీని మాఫీ చేసి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని నాలుగు వాయిదాలలో చెల్లించే విధంగా అవకాశం కల్పించాలని ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రభుత్వం ను కోరింది.రైస్ మిల్ పరిశ్రమ రైతులకు మద్దతుగా నిలుస్తూ వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కీలక రంగమని ఈ రంగం క్షీణిస్తే రైతులు కార్మికులు రవాణా రంగం వంటి అనేక రంగాలు ప్రభావితమవుతాయని బాదం ప్రవీణ్ తెలిపారు.అందువల్ల ప్రభుత్వం మిల్లర్ల సమస్యలను పరిగణలోకి తీసుకొని తక్షణమే అనుకూల నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్ అసోసియేషన్ సభ్యులు జిల్లా వ్యాప్తంగా ఉన్న పలువురు రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.