Home Uncategorized దివ్యాంగులకు అండగా సమాజం నిలవాలి : మేయర్ కొలగాని శ్రీనివాస్

దివ్యాంగులకు అండగా సమాజం నిలవాలి : మేయర్ కొలగాని శ్రీనివాస్

9
0

కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, మే 11:

సమగ్ర శిక్ష మరియు అలింకో ఆధ్వర్యంలో దివ్యాంగ బాలబాలికలకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం సోమవారం కరీంనగర్ భవిత కేంద్రంలో నిర్వహించారు. గత నవంబరులో గుర్తించిన 120 మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, రోలేటర్లు, వినికిడి యంత్రాలు, టీఎల్‌ఎం కిట్లు, వీల్‌చైర్లు తదితర ఉపకరణాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ దివ్యాంగులకు సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. వారికి ప్రభుత్వం అందించే అలవెన్సులు, సౌకర్యాలు సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు రూ.20 లక్షల విలువైన ఉపకరణాలను పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. దివ్యాంగులకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావించాలని పేర్కొన్నారు.
జిల్లా అదనపు కలెక్టర్ మరియు విద్యాశాఖ అధికారి అశ్విని తానాజీ వాకిడి మాట్లాడుతూ ప్రతి దివ్యాంగ విద్యార్థికి అవసరమైన సౌకర్యాలు తప్పనిసరిగా అందించాలని, ఎవరినీ విస్మరించకూడదని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి సరస్వతి, జిల్లా విద్యాశాఖ ఎడీ రామ్ మొండయ్య, కరీంనగర్ మండల విద్యాశాఖ అధికారి భద్రయ్య, కోఆర్డినేటర్ డి. శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ పడాల శ్రీజ, ఐఈఆర్‌పీలు, తల్లిదండ్రులు, దివ్యాంగ పిల్లలు పాల్గొన్నారు.