Home Uncategorized ఉపాధి హక్కుల పరిరక్షణ కోసం పోరాటాలకు సిద్ధంకండి

ఉపాధి హక్కుల పరిరక్షణ కోసం పోరాటాలకు సిద్ధంకండి

7
0
  • మే 15న గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ధర్నాలు – మే 20న కలెక్టరేట్ ముట్టడి
  • వ్యవసాయ కార్మికుల హక్కులను హరించే విధానాలను వ్యతిరేకించాలని పిలుపు

ఖమ్మం రూరల్, ఆర్గాన్ న్యూస్, మే 11:

వ్యవసాయ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం మే 15న గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద నిర్వహించనున్న ధర్నాలు, ఉపాధి పనుల బంద్ కార్యక్రమాన్ని, అలాగే మే 20న ఖమ్మం కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టనున్న భారీ ధర్నాను విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు గ్రామంలో ఉపాధి పనుల వద్ద నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు గ్రామీణ పేదల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని విమర్శించారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతూ కీలక పరిశ్రమలను ఆదాని, అంబానీల వంటి పెట్టుబడిదారులకు కారు చౌకగా అప్పగిస్తున్న విధానాలను ప్రజలు వ్యతిరేకించాలని కోరారు.
దేశవ్యాప్తంగా కోట్లాది గ్రామీణ వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 35 కోట్ల మంది గ్రామీణ కార్మికుల జీవనాధారమైన ఉపాధి హామీ పనులను నిర్వీర్యం చేసే చర్యలను ఖండించాలని పిలుపునిచ్చారు.
ఉపాధి పనులకు నష్టం కలిగించే వీబీజీ రాంజీ బిల్లును తక్షణమే రద్దు చేయాలని, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వ్యవసాయ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.
గ్రామీణ పేదల జీవనోపాధి, కార్మికుల హక్కుల రక్షణ కోసం జరగనున్న ఈ పోరాటాల్లో ప్రతి గ్రామం నుంచి పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ ప్రచార కార్యక్రమంలో పొన్నెకల్లు గ్రామ సర్పంచ్ కోటి శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక నాయకులు వడ్లమూడి నాగేశ్వరరావు, కారుమంచి గురవయ్య, వెంకటయ్య, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.