Home Adyatmikam ఖమ్మంలో శ్రీవారి ఆలయానికి గ్రీన్ సిగ్నల్

ఖమ్మంలో శ్రీవారి ఆలయానికి గ్రీన్ సిగ్నల్

13
0
  • మంత్రి తుమ్మల కృషి ఫలితం – టీటీడీ ఆమోదం
  • 20 ఎకరాల్లో తిరుమల తరహా నిర్మాణం
  • ద్వంసలాపురంలో భూమి కేటాయింపు
  • ‘చిన్న తిరుమల’గా ఖమ్మం – భక్తులకు స్థానికంగానే దర్శనం
  • పర్యాటకం, ఉపాధికి ఊతం
  • సమగ్ర ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి

ఆర్గాన్ న్యూస్,ఖమ్మం ప్రతినిధి , మే 6:

ఖమ్మం నగర ఆధ్యాత్మిక చరిత్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి టీటీడీ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భక్తుల ఎన్నో ఏళ్ల కల సాకారం దశలోకి అడుగుపెట్టింది.
తెలంగాణ ప్రభుత్వం ద్వంసలాపురం రెవెన్యూ పరిధిలో కేటాయించిన 20 ఎకరాల భూమిలో ఈ ప్రతిష్టాత్మక ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. రాష్ట్ర క్యాబినెట్ భూమి కేటాయింపుకు ఇప్పటికే ఆమోదం తెలిపిన నేపథ్యంలో, టీటీడీ బోర్డు అనుమతితో నిర్మాణానికి అన్ని మార్గాలు సుగమమయ్యాయి.
ఈ ప్రాజెక్టు సాధనలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. ఖమ్మం భక్తులకు తిరుమల తరహా దర్శనం స్థానికంగానే అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఆయన నిరంతరం ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ఈ యత్నం సాకారం దిశగా ముందుకు సాగింది.
ద్వంసలాపురంలో నిర్మించనున్న ఈ ఆలయ సముదాయంలో వసతి గృహాలు, కళ్యాణ మండపం, అన్నప్రసాద కేంద్రం, పార్కింగ్ సదుపాయాలు, ఆధునిక క్యూ లైన్లు వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. తిరుమల శైలిలో నిత్య కైంకర్యాలు, దర్శన విధానాలు అమలు చేయనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే భూమి కేటాయింపుకు సహకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. రెండు రాష్ట్రాల సమన్వయంతో ఈ ప్రాజెక్టు సాధ్యమైందని పేర్కొన్నారు.
ఈ ఆలయ నిర్మాణంతో ఖమ్మం జిల్లా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. పర్యాటక రద్దీ పెరగడంతో స్థానిక వ్యాపారాలకు ఊతం లభించడంతో పాటు ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయి. రహదారులు, మౌలిక వసతులు కూడా మెరుగుపడనున్నాయి.
టీటీడీ నిధులతో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఖమ్మం నగరం ‘చిన్న తిరుమల’గా రూపుదిద్దుకునే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.
“ఖమ్మం ప్రజల దీర్ఘకాలిక కోరిక నెరవేరింది. త్వరలోనే టీటీడీ అధికారులతో సమావేశమై నిర్మాణ పనులను వేగవంతం చేస్తాం” అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.