- తెలుగు వారి నూతన సంవత్సరానికి ఆధ్యాత్మిక ఆరంభం ఉగాది పర్వదినం సందర్భంగా ఆర్గాన్ న్యూస్ పాఠకుల కొరకు ప్రత్యేక కథనం..
సమర్పణ: అక్కినేపల్లి పురుషోత్తమరావు, ఆర్గాన్ న్యూస్, రంగారెడ్డి:
ఉగాది ప్రాముఖ్యత – కాలచక్రానికి నూతన ఆరంభం
“యుగాది” అనే పదమే కాలక్రమంలో “ఉగాది”గా మారింది. యుగానికి ఆది అయిన ఈ రోజు తెలుగు ప్రజలకు నూతన సంవత్సరారంభంగా భావిస్తారు. అందుకే ఉగాదిని సంవత్సరాది అని కూడా పిలుస్తారు. చాంద్రమానం ప్రకారం ప్రభవ నుంచి క్షయ వరకు మొత్తం 60 సంవత్సరాల చక్రం తిరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ప్రత్యేక నామంతో కొనసాగుతూ మళ్లీ ప్రభవానికి చేరుతుంది.
ఇతిహాసాల ప్రకారం బ్రహ్మదేవుడు చైత్ర శుద్ధ పాడ్యమినాడే సృష్టిని ప్రారంభించాడని చెబుతారు. అందుకే ఈ రోజును ఆదియుగ ఆరంభంగా పరిగణిస్తారు. భారతీయ సంస్కృతిలో కాలాన్ని మహాయుగం, యుగం, శకం, సంవత్సరాలుగా విభజించారు. కృత, త్రేతా, ద్వాపర, కలి అనే నాలుగు యుగాలతో మహాయుగం ఏర్పడుతుంది. అలాగే సంవత్సరం ఆయనలు, రుతువులు, మాసాలు, నక్షత్రాల ఆధారంగా విభజించబడింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా చాంద్రమానం అనుసరిస్తారు.
ఉగాది ఆచరణలు – సంప్రదాయాల్లో ఆరోగ్యం, ఆనందం
ఉగాదిని సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం మన పూర్వీకులు నిర్దేశించిన విధానం. ముందురోజే ఇళ్లను శుభ్రపరచి పూజా మందిరాన్ని అలంకరించాలి. గుమ్మాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, మామిడి ఆకులతో తొరణాలు కట్టాలి. ముంగిళ్లలో రంగవల్లులు వేసి వసంత లక్ష్మిని ఆహ్వానించాలి.
ఉగాది రోజు తెల్లవారుజామున లేచి అభ్యంగ స్నానం చేసి, నూతన వస్త్రాలు ధరించి దేవుడిని పూజించాలి. పెద్దలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఉగాది పచ్చడి స్వీకరణకు విశేష ప్రాముఖ్యత ఉంది. వేప పూత, బెల్లం, మామిడి, నెయ్యి, మిరియాలు, ఉప్పు వంటి పదార్థాలతో తయారయ్యే ఈ పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి. ఇవి జీవితం లోని సుఖదుఃఖాలను సూచించడమే కాకుండా ఆయుర్వేద పరంగా ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయని విశ్వసిస్తారు.
అనంతరం పంచాంగ శ్రవణం చేయడం సంప్రదాయం. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంశాలతో కూడిన పంచాంగం ద్వారా సంవత్సర ఫలితాలను తెలుసుకుంటారు. ఆలయ దర్శనం చేసుకోవడం ద్వారా శుభఫలితాలు కలుగుతాయని నమ్మకం.
ఉగాది పర్వదినాన్ని ఆనందంగా, సత్సాంప్రదాయాలతో జరుపుకుంటూ అందరికీ శుభం కలగాలని ఆకాంక్షిద్దాం.
శుభం భూయాత్…



