- పది మంది భక్తులకు గాయాలు
మిర్యాలగూడ ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మార్చి 4:
మిర్యాలగూడ నియోజకవర్గం వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో కొలువుదీరిన శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి జాతరలో బుధవారం తెల్లవారుజామున భక్తిశ్రద్ధల మధ్య అగ్నిగుండం కార్యక్రమం నిర్వహించారు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో వందలాది మంది భక్తులు స్వామివారిపై అపార విశ్వాసంతో అగ్నిగుండం దాటి తమ మొక్కులు తీర్చుకున్నారు.
మహాశివరాత్రి ఉత్సవాల అనంతరం స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించగా, హోలీ పండుగ సందర్భంగా ఈ అగ్నిగుండం కార్యక్రమాన్ని సంప్రదాయంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. అయితే అగ్నిగుండం కార్యక్రమం జరుగుతున్న సమయంలో భక్తులు ఒక్కసారిగా ముందుకు రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పది మంది భక్తులు గాయపడ్డారు. బందోబస్తులో ఉన్న పోలీసులు వెంటనే స్పందించి, వేములపల్లి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, మాడుగులపల్లి ఎస్‌ఐ కృష్ణయ్యలు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన భక్తులను సమీప ఆసుపత్రికి తరలించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.


