- యూఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి అల్లపు అభిలాష్ కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 6:
అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నగరంలోని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యూఎస్ఎఫ్ఐ) నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా యూఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి అల్లపు అభిలాష్ మాట్లాడుతూ… డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సమాజానికి ఇచ్చిన దిశ, దేశానికి అందించిన రాజ్యాంగం ఎప్పటికీ మరువలేనిదని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలను అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ కలలు కన్న సమానత్వం, నాణ్యమైన విద్య అందరికీ సులభంగా అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. కానీ విద్యను వాణిజ్యవత్కరిస్తూ, సామాన్య విద్యార్థులపై భారం పెంచడం సిగ్గుచేటని అభిలాష్ విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రయత్నాలను ప్రజలంతా ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రోత్సహిస్తున్న మతోన్మాద భావజాలాన్ని అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగాలని, అంబేద్కర్ ఆలోచనలే దానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.
అంబేద్కర్ ఆశయ సాధన కోసం నిరంతరం ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ, ఉద్యమాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.
కార్యక్రమంలో నాయకులు సంతోష్, విజయ్, వర్ధరాజు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.


