- ఖమ్మం కాంగ్రెస్ అధ్యక్షునిగా నూతి సత్యనారాయణ గౌడ్
- బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి
- ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు పట్టణంలో భారీ ర్యాలీలో పాల్గొన్న మంత్రులు
- డీసీసీగా సేవలందించిన పువ్వాళ్ల దుర్గాప్రసాద్ సేవలను కొనియాడుతూ అభినందనలు
- నూతన డీసీసీగా ప్రమాణ స్వీకారం చేసిన నూతి సత్యనారాయణ గౌడ్ కి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రులు
ఖమ్మం,ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 1:
జిల్లా కాంగ్రేస్ నూతన అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరిస్తున్న నూతి సత్యనారాయణ గౌడ్కు అభినందనలు తెలియజేసిన అనంతరం మంత్రులు మాట్లాడుతూ..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనే ప్రేమ తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, దేశాన్ని పాలిస్తున్న బీజేపీకి అలాంటి సంకల్పం లేదని.. కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లను బలపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను గుర్తుచేశారు.. పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లును లేవనెత్తాలని సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యులకు సూచించినట్లు తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని మంగళవారం కొత్తగూడెంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారని తెలిపారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ముందుకు నడిపిన మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరుతో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు.
తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి దిశను ప్రతిబింబించే ‘తెలంగాణ రైజింగ్ 2047’ డాక్యుమెంట్‌ను ఈ నెల 9న ఆవిష్కరించబోతున్నట్లు తెలిపారు.
సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వ నిబద్ధతను వివరించిన డిప్యూటీ సీఎం , కేవలం సంక్షేమ పథకాలకే 1.10 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. 93 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ, మహిళలకు వడ్డీలేని 26 వేల కోట్ల రుణాలు, ఇళ్లు లేని పేదలకు ఐదు లక్షలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి పథకాలను వివరించారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎప్పటికీ రాజీ పడదని అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


