Home POLITICS ముఖ్యమంత్రి హుస్నాబాద్ సభ ఏర్పాట్లపై మంత్రి పొన్నం సమీక్ష

ముఖ్యమంత్రి హుస్నాబాద్ సభ ఏర్పాట్లపై మంత్రి పొన్నం సమీక్ష

20
0
  • 3వ తేదీ సీఎం రేవంత్‌ రెడ్డి భారీ బహిరంగ సభ

కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 1:

కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో ఈ నెల 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను సమాచార, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం అధికారులతో కలిసి సమీక్షించారు. సభ స్థలాన్ని సందర్శించిన మంత్రి స్టేజ్ నిర్మాణం, ఎల్ఈడీ స్క్రీన్లు, ప్రజల కోసం కుర్చీలు, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లు, వీఐపీ–పబ్లిక్ పార్కింగ్ ప్రదేశాలు, హెలిపాడ్ వంటి అంశాలను పరిశీలించారు.
భద్రతా చర్యలపై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎన్నికల్లో గెలిచి రెండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులు, శాసన సభ్యులు హుస్నాబాద్‌కు రాబోతున్నారు. ఇది కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ జిల్లాల ప్రజలకు ఎంతో ముఖ్యమైన సభ. గ్రామాల నుండి ప్రజలే స్వచ్ఛందంగా సభకు రావాలనే వ్యక్తం చేసారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రభుత్వం ఏర్పాట్లు చేయదు; ప్రజలే ముందుకు రావాలని తెలిపారు.
సభలో విద్య, వ్యవసాయం, ఉపాధి అంశాలకు ముఖ్య ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరిగే అవకాశముందని వెల్లడించారు. “కోడ్ అడ్డంకి లేకుంటే గౌరవెల్లి భూ నిర్వాసితులకు చెక్కుల పంపిణీ కూడా చేపడతాం,” అని చెప్పారు.

రాహుల్ గాంధీపై కేసులు – రాజకీయ వేధింపులే: మంత్రి

నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు విషయాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. ఈడి, ఎన్ఫోర్స్‌మెంట్ వంటి సంస్థలను బీజేపీ రాజకీయ దాడులకు వేదికగా ఉపయోగిస్తోంది. పార్లమెంట్‌లో వైఫల్యాలపై ప్రశ్నించే ధైర్యం రాహుల్ గాంధీకి ఉంది కాబట్టి ఆయనపై ఒత్తిడి తెచ్చేందుకు కేసులు పెడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం, అని విమర్శించారు.

హైదరాబాద్ విజన్–2047 వైపు ప్రభుత్వం

హైదరాబాద్ అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించిన మంత్రి, భౌగోళిక పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, నీటి వనరులు, రవాణా, కాలుష్య రహిత వాతావరణం… ఇవన్నీ హైదరాబాద్‌ను దేశంలోని ప్రధాన నగరాలలో ముందంజలో నిలుపుతున్నాయి. మా ప్రభుత్వం విజన్–2047 తో పని చేస్తోంది. తెలంగాణను అర్బన్, సెమీ అర్బన్, రూరల్ విభాగాలుగా విభజించి సమగ్ర అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం, అన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ సభను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. రాబోయే సభ హుస్నాబాద్‌ నియోజకవర్గ అభివృద్ధికి కొత్త దిశను చూపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.