- తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమిట్‌కు రావాలి
- కరీంనగర్‌లో చైతన్యపురి మహాశక్తి ఆలయంలో ఇరువురు భేటీ కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 6:
తెలంగాణ భవిష్యత్ దిశను నిర్ణయించే ‘తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమిట్’ కు కేంద్ర మంత్రి బండి సంజయ్‍ను ఆహ్వానిస్తూ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ప్రత్యేకంగా కలుసుకున్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయం వద్ద బండి సంజయ్‌ను ప్రత్యక్షంగా కలిసి…
“ఈసారి తెలంగాణ కోసం అందరం ఒక్క స్టేజ్ మీద నిలబడాలి” అంటూ పొన్నం అధికారిక ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
సమిట్ డిసెంబర్ 8, 9 తేదీలలో హైదరాబాద్ శ్రీశైలంకు సమీపంలోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు, ఆర్థిక నిపుణులు, టెక్ దిగ్గజాలు, పలు రంగాల గ్లోబల్ లీడర్లు పాల్గొనబోతున్నారు.
‘అభివృద్ధికి పార్టీ తేడా లేదు’ – పొన్నం ప్రభాకర్
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ… రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి. ఏ పార్టీ లో ఉన్నా, తెలంగాణ కోసం అందరం కలిసిరావాలని అన్నారు.
గత పదేళ్లలో రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిందని, తిరిగి ఉత్సాహంతో ముందుకు సాగేందుకు కేంద్రం సహకారం అత్యవసరం అని స్పష్టం చేశారు.
తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలపడానికి ప్రభుత్వం పలు కీలక ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ గ్లోబల్ సమిట్‌తో కొత్త పెట్టుబడులు, కొత్త అవకాశాలు రాష్ట్రంలోకి వస్తాయి. అందుకే అన్ని పార్టీలనూ ఆహ్వానిస్తున్నాం అని వివరించారు.
బండి సంజయ్‌కు ప్రత్యేక ఆహ్వానం
కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న బండి సంజయ్ సహకారం తెలంగాణకు ఎంతో అవసరం. అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేస్తేనే ఫలితం కనబడుతుంది. సమిట్‌కు ఆయన రావాలని కోరడంలో రాజకీయ ఉద్దేశం లేదు… రాష్ట్ర ప్రయోజనం మాత్రమే ఉంది అని తెలిపారు.
ఆలయంలో జరిగిన ఈ భేటీ జిల్లాలో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రెండు పార్టీల నేతలు ఒకే వేదికపై అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం మంచి సంకేతమని పలువురు అభిప్రాయపడ్డారు.
భారత్ ఫ్యూచర్ సిటీలో భారీ ఏర్పాట్లు
సమిట్ కోసం ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే హైఅలర్ట్‌లో పనిచేస్తోంది.
ప్రపంచస్థాయి కన్వెన్షన్ హాల్స్ స్టార్ట్‌అప్స్–ఇన్నోవేషన్ ఎక్స్‌పో
పెట్టుబడిదారులతో రౌండ్ టేబుల్ సమావేశాలు
ఐటీ, ఇండస్ట్రీ, కల్చర్, అగ్రి–రిసోర్స్ సెషన్లు
వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. తెలంగాణ భవిష్యత్తు మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టే ప్రత్యేక సెషన్ కూడా ఏర్పాటు చేయబడింది.


