Home ఎడ్యుకేషన్ ప్రత్యేక విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలి

ప్రత్యేక విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలి

12
0
  • జనగణన, రైతు నమోదు, ధాన్యం కొనుగోళ్లపై సీఎస్ సమీక్ష
  • కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఆదేశాలు

కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, మే 9:

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 11 నుంచి 17 వరకు ప్రత్యేక విద్యా వారోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన విద్యా వారోత్సవాలు, రైతు నమోదు, జనగణన, ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు.
కరీంనగర్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల్లో సృజనాత్మకత, పఠనాభిరుచి పెంపొందించడం, ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం పెంచడం లక్ష్యంగా వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీఎస్ తెలిపారు. ప్రతి రోజుకు ప్రత్యేక థీమ్‌తో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
రైతు నమోదు పూర్తి చేయాలి:
ఈ నెలాఖరులోగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి, ఏఈవోలు రైతులతో సమన్వయం చేసుకుంటూ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
జనగణనపై దృష్టి పెట్టాలి:
జనగణనలో భాగంగా ఈ నెల 10లోగా వీలైనంత ఎక్కువ కుటుంబాలతో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. అన్ని స్థాయిల ఉద్యోగులు పూర్తిస్థాయిలో పాల్గొనాలని, మహిళా సంఘాలను కూడా భాగస్వామ్యం చేయాలని సూచించారు.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి:
రాష్ట్రంలో అకాల వర్షాల పరిస్థితుల దృష్ట్యా వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ధాన్యం కొనుగోలు, ట్యాబ్ ఎంట్రీలు, రైతులకు చెల్లింపులు వేగంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబు, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నర్సింగరావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

విద్యా వారోత్సవాల షెడ్యూల్

మే 11 – ఫౌండేషన్ డే:
ప్రత్యేక విద్యా వారోత్సవాలు, సమ్మర్ క్యాంప్‌ల ప్రారంభం. హైదరాబాద్ లాల్‌బహదూర్ శాస్త్రి స్టేడియంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
మే 12 – రిమీడియల్ క్యాంపులు:
ఎస్‌ఎస్‌సి రిమీడియల్ క్యాంపుల ప్రారంభం, ఇంటర్మీడియట్ రిమీడియల్ క్యాంపుల ముగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మే 13 – ప్రజాప్రతినిధులతో వర్క్‌షాప్‌లు:
సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులతో పాఠశాల అభివృద్ధిపై వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నారు.
మే 14 – జయశంకర్ బడి బాట:
మెగా పేరెంట్–టీచర్ మీటింగ్‌తో పాటు ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల నమోదు కార్యక్రమం చేపట్టనున్నారు.
మే 15 – లైబ్రరీ డే:
“లైబ్రరీస్ : ది హార్ట్ అఫ్ నాలెడ్జ్ ” పేరిట పఠన కార్యక్రమాలు, కథల చెప్పడం, పుస్తక ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
మే 16 – కళావిభవం:
ఆర్ట్, క్రాఫ్ట్ & కల్చరల్ డే పేరిట చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, హస్తకళల పోటీలు నిర్వహించనున్నారు.
మే 17 – విద్య విజయోత్సవం:
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎస్‌ఎస్‌సి, ఇంటర్, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందజేయనున్నారు.