Home తెలంగాణ జర్నలిస్టుల పిల్లల చదువుల్లో 50% ఫీజు రాయితీ కల్పించాలి​

జర్నలిస్టుల పిల్లల చదువుల్లో 50% ఫీజు రాయితీ కల్పించాలి​

7
0
  • జిల్లా విద్యాశాఖ ఏడీ శంభు ప్రసాద్‌కు టీయూడబ్ల్యూజే (టీజెఎఫ్) వినతి
  • ఆయా పాఠశాలకు ఆదేశాలు జారీ చేస్తామని ఏడీ హామీ
  • హర్షం వ్యక్తం చేసిన జర్నలిస్టులు

​భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, జూన్ 15 :
జర్నలిస్టుల పిల్లల విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వారి చదువులకు ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పించాలని టీయూడబ్ల్యూజే (టీజెఎఫ్) హెచ్ – 143 యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కల్లోజి శ్రీనివాస్, ఎండి షఫీ ల ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ ఏడీ శంభూ ప్రసాద్‌కు సోమవారం ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.
​ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం సమాచారాన్ని అందించే క్రమంలో జర్నలిస్టులు ఎన్నో సవాళ్లను, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న విద్యా ఖర్చుల కారణంగా జర్నలిస్టుల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఎయిడెడ్ మరియు ప్రైవేట్ విద్యాసంస్థల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ఈ అంశంపై సానుకూలంగా స్పందించి, జర్నలిస్టుల సంక్షేమానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.

విద్యాశాఖ ఏడి సానుకూల స్పందన

    జర్నలిస్టుల వినతిపై జిల్లా విద్యాశాఖ ఏడీ శంభూ ప్రసాద్ సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టుల పిల్లల ఫీజు రాయితీకి సంబంధించి జిల్లాలోని ఆయా పాఠశాలకు జర్నలిస్టుల పిల్లల పేరు మీద త్వరలోనే స్పష్టమైన ఆదేశాలు (ఆర్డర్స్) జారీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ​విద్యాశాఖ ఏడీ ఇచ్చిన ఈ హామీ పట్ల టీయూడబ్ల్యూజే నాయకులు, స్థానిక జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (టీజెఎఫ్) హెచ్ - 143 యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి అచ్చిన ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కాగితపు వెంకటేశ్వర్లు,  టెంజు జిల్లా అధ్యక్షులు వట్టికొండ రవి, ప్రచార కార్యదర్శి కృష్ణంరాజు, ప్రతినిధులు కృష్ణారావు, ప్రవీణ్, శామ్, నరేష్, సూరి, ఫహీమ్, సురేష్, మొగిలి, రాము, షకీల్, రబ్బాని, రాందాస్, లక్ష్మణ్, మురళి,  పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.