కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, మే 4:
కరీంనగర్‌లో జరిగిన తాజా దాడి ఘటనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలర్స్‌ను పరిశీలించిన అనంతరం, దుండగుల దాడిలో గాయపడిన బాధితులను ఆస్పత్రిలో పరామర్శించిన ఆయన, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, కరీంనగర్‌లో జరిగిన ఈ ఘటన దుర్మార్గమైనదని, దురదృష్టకరమని పేర్కొన్నారు. సంఘటన జరిగి 32 గంటలు గడిచినా ఒక్కరినీ అరెస్ట్ చేయలేకపోవడం పోలీసుల వైఫల్యాన్ని సూచిస్తుందని అన్నారు. ఈ ఘటనతో కరీంనగర్ ప్రజలు భయాందోళనలకు గురయ్యారని తెలిపారు.
పట్టపగలే దుండగులు నగల దుకాణంలోకి చొరబడి దోపిడీకి పాల్పడడం రాష్ట్రంలో భద్రతా లోపాలను బహిర్గతం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. కాల్పుల్లో ప్రాణాలు పోయాయేమోనని భయపడి దుండగులు పారిపోయారే గానీ, పోలీసుల భయంతో కాదని అన్నారు. దాదాపు నాలుగైదు కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు దోచుకెళ్లారని తెలిపారు.
మాజీ సీఎం కేసీఆర్ పాలనలో శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇచ్చి తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపామని, పోలీసులకు ఆధునిక వాహనాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం మాత్రం రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయాయని, కాంగ్రెస్ పాలనలో పోలీసులు పట్ల భయం లేకుండా పోయిందని విమర్శించారు.
రాష్ట్ర హోంశాఖ సీఎం చేతిలోనే ఉండగా, ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరమని కేటీఆర్ అన్నారు. గతంలో జరిగిన చందానగర్, కోటి ఘటనలను కూడా ప్రస్తావిస్తూ, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
కరీంనగర్‌ను సేఫ్ సిటీగా తీర్చిదిద్దేందుకు గతంలో చేపట్టిన చర్యలను గుర్తు చేస్తూ, ప్రస్తుతం ఆ వ్యవస్థలు సక్రమంగా పనిచేయడం లేదని అన్నారు. పోలీసులు వెంటనే నాకాబందీ చేపట్టి నిందితులను పట్టుకోవాల్సిందని, కానీ అలాంటి చర్యలు కనిపించడం లేదని విమర్శించారు.
ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని, రాజకీయ కక్షలతో వ్యవహరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. సీఎం ఇప్పటికైనా మేలుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




