Home క్రైమ్ బాధితురాలికి న్యాయం జరిపించే వరకు వదిలేది లేదు

బాధితురాలికి న్యాయం జరిపించే వరకు వదిలేది లేదు

6
0
  • నిందితుడుని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలి
  • రాష్ట్రంలో మహిళల రక్షణ ప్రశ్నార్థకంగా ఉంది
  • నిమ్స్‌లో బాధితురాలిని పరామర్శించిన బీజేపీ అగ్రనేతలు

హైదరాబాద్,ఆర్గాన్ న్యూస్,జూన్ 15:

రాష్ట్రంలో మహిళల రక్షణ ప్రశ్నార్థకంగా మారిందని, శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పిందనడానికి ఖమ్మం నగరంలో జరిగిన అమానుష ఘటనే నిదర్శనమని భారతీయ జనతా పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం ఖమ్మంలో 12 ఏళ్ల మైనర్ బాలికపై గౌస్ పాషా అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఐదు అంతస్తుల భవనం పైనుంచి కిందికి తోసి హతమార్చేందుకు ప్రయత్నించిన ఘటనపై వారు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రాక్షసత్వాన్ని తలపించే ఈ దారుణమైన ఘటనలో ప్రాణాపాయ స్థితిలో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని సోమవారం బీజేపీ బృందం స్వయంగా పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితిని చూసి బీజేపీ జాతీయ నాయకులు, కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. గౌతమ్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి దేవకీ వాసుదేవరావు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పా రెడ్డి, ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలిని స్వయంగా పరీక్షించిన నాయకులు, ఆమె తీవ్రమైన ట్రోమాలో ఉందని, ఎవరైనా తాకితే భయంతో ఉలిక్కిపడుతోందని, బాలిక వెన్నుముక దెబ్బతినడంతో రెండు కాళ్లు పక్షవాతానికి గురయ్యాయని వివరించారు. శరీరమంతా మల్టిపుల్ ఫ్రాక్చర్లు, చేతులు, పక్కటెముకలకు తీవ్ర గాయాలయ్యాయని, పన్నెండేళ్ల బాలికపై 57 ఏళ్ల వ్యక్తి చేసిన ఈ రాక్షస చర్యను మానవీయ కోణంలో ఎవరూ క్షమించలేరని వారు పేర్కొన్నారు. నిందితుడు రౌడీషీటర్ అని అందరికీ తెలిసి కూడా ప్రభుత్వం అతడిని కాపాడే ప్రయత్నం చేస్తోందని, ఇటువంటి వ్యక్తులపై చర్యలు లేకపోవడం వల్లనే ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని వారు మండిపడ్డారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో గత ఏడాది కాలంలో సుమారు 563 పోక్సో కేసులు నమోదయ్యాయని, రికార్డు అయినవే ఇన్ని ఉంటే, ఫిర్యాదు చేయలేనివి ఇంకా ఎన్ని ఉంటాయోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన వెంటనే బాధితురాలిని ప్రైవేట్ ఆసుపత్రి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి, ఆపై నిమ్స్‌కు తరలించినా, ప్రభుత్వం తరఫున కనీస ఆర్థిక సహాయం అందలేదని వారు ఆరోపించారు. స్థానిక రాజకీయ పార్టీలకు చెందిన కార్పొరేటర్లు ఈ కేసును మాఫీ చేయడానికి ప్రయత్నించారని, వారి వివరాలను ఆర్‌టిఐ ద్వారా సేకరిస్తున్నామని, నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని, బాలికకు జీవితాంతం తోడుగా ఉండేలా ప్రభుత్వం బాధ్యత వహించాలని వారు స్పష్టం చేశారు. నిందితుడిని బహిరంగంగా ఎన్‌కౌంటర్ చేయాలని, లేనిపక్షంలో కేసును తమకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. బాధితురాలికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన న్యాయం జరగాలని, నిందితుడికి కఠిన శిక్ష పడేవరకు బీజేపీ పోరాటం ఆపేది లేదని వారు హెచ్చరించారు. హోం మంత్రి, ముఖ్యమంత్రి కనీసం పరామర్శించే మానవత్వం చూపకపోవడం సిగ్గుచేటని వారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితురాలికి మెరుగైన వైద్యం, తగిన ఆర్థిక సహాయం అందించాలని వారు కోరారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి బాధితురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు వాకధాని పుల్లారావు యాదవ్, నంబూరి రామలింగేశ్వరరావు, నాయకులు మేకల నాగేందర్, ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు బోయల వెంకట్, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు పమ్మీ అనిత, మంద సరస్వతి, ఫణి కుమారి , నాగమణి తదితరులు పాల్గొన్నారు.