Home ఖమ్మం బతుకు భారమై… జీవితం అవిటిదైవరద బాధితుడికి అందని సహాయం

బతుకు భారమై… జీవితం అవిటిదైవరద బాధితుడికి అందని సహాయం

6
0
  • ప్రభుత్వ ఆదరణ కోసం ఎదురుచూపులు

చింతకాని ఆర్గాన్ న్యూస్ మే 14:

చింతకాని మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన గుర్రం నాగేశ్వరరావు (40) కుటుంబానికి జరిగిన విషాదం మాటల్లో చెప్పలేనిది. 2024లో వచ్చిన తుపాను కారణంగా చెరువులు, కుంటలు, వాగులు, కాలువలు ఉప్పొంగి మున్నేరు వరద భీభత్సాన్ని సృష్టించాయి. ఆ వరదల వల్ల ఎన్నో కుటుంబాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. ఆ బాధితుల్లో నాగేశ్వరరావు కుటుంబం ఒకటి.వరద తగ్గిందని భావించి భార్య వసంతతో కలిసి బయలుదేరిన నాగేశ్వరరావు, ఖమ్మం–దంసలాపురం ఫ్లైఓవర్ సమీపానికి చేరుకోగానే బురద కారణంగా ద్విచక్ర వాహనం జారి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో భార్య వసంత తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అదే సమయంలో నాగేశ్వరరావుకు కుడిచేయి విరిగింది.కుటుంబ సభ్యులు ఆయనకు చికిత్స అందించేందుకు ఎంతో ప్రయత్నించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లో ఆపరేషన్ చేయించినప్పటికీ చేయి పూర్తిగా పనిచేయకుండా పోయింది. దీంతో నాగేశ్వరరావు వికలాంగుడిగా మారి, ప్రస్తుతం ఒక్క చేత్తోనే తన పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
భార్యను కోల్పోయి, ఇద్దరు కుమారుల బాధ్యతలను మోస్తున్న నాగేశ్వరరావు, శారీరక వైకల్యం కారణంగా ఎలాంటి పనులుచేసుకోలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ప్రమాదం జరిగి దాదాపు ఒక సంవత్సరం ఎనిమిది నెలలు గడిచినా ప్రభుత్వం ద్వారా రావాల్సిన శ్రీనిధి ఇన్సూరెన్స్ ఇప్పటికీ అందలేదు.ఇక వికలాంగుల పెన్షన్ కోసం చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. కుడిచేయి పూర్తిగా పనికిరాకపోయినా, వైద్యులు 40 శాతం వికలాంగత్వమే ఉందని ధృవీకరణ పత్రం ఇవ్వడంతో ఆయనకు వికలాంగుల పెన్షన్ మంజూరు కాలేదు.కష్టపడి బతికే జీవితాన్ని ఒక్క ప్రమాదం ఛిద్రము చేసింది. భార్యను కోల్పోయి, శారీరక వైకల్యంతో జీవితం భారంగా మారిన నాగేశ్వరరావును ప్రభుత్వం, అధికారులు తక్షణమే ఆదుకుని న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.