- ధాన్యం కొనుగోళ్లలో జాప్యం క్వింటాకు 5-8కిలోల తరుగు.
- అన్నదాతపై బహిరంగ దోపిడీ !
- ప్రకృతి ఒకవైపు..ప్రభుత్వనిర్లక్ష్యం మరోవైపు..!
- బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా నాయకుడు భూక్య జంపన్న
ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, మే 14:
జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితులపై బీఆర్ఎస్ జిల్లా నాయకుడు భూక్య జంపన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో రైతన్నకు కష్టాలు కన్నీళ్లు నష్టాలే మిగిలాయని మండిపడ్డారు. గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం రాశులతో రోజుల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్నా కొనుగోళ్లలో తీవ్ర జాప్యం కొనసాగుతోందన్నారు.
క్వింటాకు 5నుంచి 8 కిలోల వరకు తరుగు పేరుతో రైతుల రక్తం చెమటల పంటను దోచుకుంటున్నారని ఇది రైతుపై జరుగుతున్న ఘోర అన్యాయమని భూక్య జంపన్న ధ్వజమెత్తారు. ఒకవైపు అకాల వర్షాలతో ధాన్యం తడిసి నాణ్యత కోల్పోతుండగా మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో సరైన రక్షణ చర్యలు లేక రైతు పూర్తిగా నష్టపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తుతో విలవిలలాడుతున్న రైతన్నను ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసి చూస్తోందని విమర్శించారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా గిట్టుబాటు ధర వేగవంతమైన కొనుగోళ్లు కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలతో రైతును గౌరవించిందని గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుకు రక్షణ లేదు ధాన్యానికి భరోసా లేదు కొనుగోలు కేంద్రాల్లో న్యాయం లేదని తీవ్రంగా విమర్శించారు.
తక్షణమే ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో జాప్యాన్ని తొలగించి తరుగు దోపిడీని అరికట్టి వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని భూక్య జంపన్న డిమాండ్ చేశారు. రైతన్నను ఇబ్బందులకు గురిచేస్తే బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతుందని హెచ్చరించారు.




