Home agriculture ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు

ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు

7
0

క్షేత్రస్థాయిలో పర్యటించి కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాలి

ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు తలెత్తితే పూర్తి బాధ్యత కలెక్టర్లదే

గన్ని బ్యాగులు, హమాలీలు, రవాణా సదుపాయాలు అందుబాటులో ఉంచాలి

ఒప్పందం మేరకు వాహనాలు సమకూర్చని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు

జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మే 12:రాష్ట్రంలో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, సీతక్క, ఎంపీ వేమ్ నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కొనుగోళ్ల పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కొనుగోలు కేంద్రాల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. గన్ని బ్యాగులు, హమాలీలు, తూకం యంత్రాలు తదితర అవసరమైన సదుపాయాలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలని, రవాణాకు అవసరమైన లారీలను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒప్పందం మేరకు వాహనాలు సమకూర్చని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించారు.

అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. గోదాముల కొరత ఉన్న ప్రాంతాల్లో రైతు బజార్లు, ఫంక్షన్ హాల్స్ తదితర భవనాలను తాత్కాలిక నిల్వ కేంద్రాలుగా వినియోగించాలని సూచించారు.

మొక్కజొన్న పంట అధికంగా పండే జిల్లాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని, రైతులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. అవసరమైన చోట పోలీస్ శాఖ సహకారంతో కొనుగోలు ప్రక్రియను సాఫీగా నిర్వహించాలని సూచించారు.

ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో ఎక్కడైనా సమస్యలు తలెత్తినా పూర్తి బాధ్యత సంబంధిత జిల్లా కలెక్టర్లదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కొనుగోళ్ల పురోగతిపై ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదికలు పంపించాలని ఆదేశించారు.

జిల్లాలో వరి ధాన్యం మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుంది కలెక్టర్ అంకిత్

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడిఓసి కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం, ఇబ్బందులు తలెత్తకుండా ఇకముందు ప్రతి కొనుగోలు కేంద్రానికి ప్రత్యేక అధికారులను నియమించి తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కి తెలిపారు . గన్ని బ్యాగులు, హమాలీలు, రవాణా వాహనాలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించేలా ప్రత్యేక ప్రణాళికతో వ్యవహరిస్తున్నామని చెప్పారు.

అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపడుతున్నామని, అవసరమైన చోట తాత్కాలిక నిల్వ సదుపాయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ధాన్యం, మొక్కజొన్న సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేలా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తామన్నారు .

ఈ వీడియో కాన్ఫరెన్స్ కు అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, పౌరసరఫరాల అధికారి ప్రేమ్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, పౌరసరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్ బాబు, జిల్లా మార్కెటింగ్ అధికారి నరేందర్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.