- ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు అరికట్టాలని డిమాండ్ కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, మే 11:
ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. కొనుగోళ్లు వేగవంతం చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెలరోజులు గడిచినా రైతుల ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడం లేదన్నారు. తేమ, తాలు పేరుతో క్వింటాల్‌కు 5 నుంచి 8 కిలోల వరకు కోత విధిస్తూ రైతులను నష్టపరుస్తున్నారని విమర్శించారు. ఏ-వన్ గ్రేడ్ ధాన్యాన్ని కామన్ గ్రేడ్‌గా చూపించి రైతులకు క్వింటాల్‌కు రూ.20 వరకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు.
రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, కొందరు అధికారులు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని ఆరోపించిన ఆయన, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్న లారీ యజమానులు, నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తాగునీరు, టెంట్లు, టార్పాలిన్లు, మహిళలకు ప్రత్యేక వాష్‌రూమ్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. గన్నీ సంచుల కొరత కారణంగా రైతులనే సంచులు తెచ్చుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు.
అకాల వర్షాల హెచ్చరికల నేపథ్యంలో వెంటనే ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని, రైతులకు ప్రకటించిన బోనస్‌ను తక్షణమే ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా నిధులు, కౌలు రైతులకు ఆర్థిక సహాయం వెంటనే విడుదల చేయాలని కోరారు.
విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మొక్కజొన్న పంటలు దగ్ధమైన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, కేంద్ర ప్రభుత్వం వెంటనే బియ్యం సేకరణ చేపట్టాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.






