- మహిళా బిల్లుపై కాంగ్రెస్‌పై విమర్శలు
- ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు
ఖమ్మం వన్ టౌన్, ఆర్గాన్ న్యూస్, ఏప్రిల్ 18:
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో కాంగ్రెస్ అడ్డుకున్నదని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఖమ్మం టూ టౌన్‌లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ పరిసరాలు మహిళా నాయకులు, కార్యకర్తల భారీ ధర్నాతో హోరెత్తాయి. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
కాంగ్రెస్‌పై బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు శీలం పాపారావు, రుద్ర ప్రదీప్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ చారిత్రక తప్పిదానికి పాల్పడిందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా వ్యవహరించడం మహిళల హక్కులను హరించడం అని అన్నారు. కాంగ్రెస్ పితృస్వామ్య ధోరణి విడనాడకపోతే మహిళా లోకం తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఆరోపణలు – ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరిక
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని బీజేపీ నేతలు మండిపడ్డారు. నెలకు రూ.2500 భృతి, తులం బంగారం, స్కూటీలు వంటి వాగ్దానాలు నిలబెట్టుకోలేదని ఆరోపించారు. కార్యక్రమంలో మహిళా నాయకులు మంద సరస్వతి, దార్ల మల్లేశ్వరి, పమ్మీ అనిత తదితరులు పాల్గొని హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.


